15 ఏళ్ల తర్వాత తెరచుకున్న ప్రభుత్వ స్కూల్
ఆదిలాబాద్ (ఏడీఎన్ఎన్) – ఆదిలాబాద్‌లో 15 ఏళ్లుగా మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మళ్లీ విద్యార్థుల కోసం తెరుచుకుంది. భుక్తాపూర్ కాలనీలోని స్టేషన్ రోడ్డు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌ను కలెక్టర్ రాజర్షి షా చొరవతో వెటర్నరీ ఆస్పత్రి భవనంలోని రెండు గదుల్లో శుక్రవారం పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి పాల్గొన్నారు. ఇటీవల కాలనీవాసులు పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కలెక్టర్‌ను కోరడంతో వెంటనే చర్యలు తీసుకుని స్కూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును 75 శాతం నుంచి 90 శాతానికి పెంచడమే లక్ష్యమని, తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని కోరారు.
మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో ఇప్పటివరకు సుమారు 10 పాఠశాలలను పునరుద్ధరించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ, పాఠశాల ఒక దేవాలయంతో సమానమని, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. విద్యతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని పేర్కొంటూ, పాఠశాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు, ప్లేట్లు పంపిణీ చేశారు. అలాగే వెటర్నరీ ఆస్పత్రి ఆవరణలో రూ.2 లక్షల వ్యయంతో నిర్మించిన రేకుల షెడ్‌ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, విద్యాశాఖ, వైద్యశాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

