అరుదైన వ్యాధితో క్రికెటర్ మృతి
ఆఫ్ఘానిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) అరుదైన వ్యాధి హీమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ (HLH)తో కన్నుమూయడం క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. ఈ విషయాన్ని ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. దేశ క్రికెట్ అభివృద్ధికి జద్రాన్ అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ బోర్డు నివాళులర్పించింది.
హెచ్ఎల్హెచ్ అనేది అత్యంత అరుదైన, ప్రాణాంతక రోగనిరోధక వ్యవస్థ వ్యాధి. సాధారణంగా శరీరాన్ని వైరస్లు, బ్యాక్టీరియా నుంచి కాపాడే రోగనిరోధక వ్యవస్థ ఈ వ్యాధిలో అదుపు తప్పి, ఆరోగ్యకరమైన కణజాలాలు, అవయవాలపైనే దాడి చేస్తుంది. దీనివల్ల కాలేయం, ప్లీహం, ఎముక మజ్జ, మెదడు వంటి కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
ఈ వ్యాధి జన్యుపరంగా రావచ్చు. అలాగే తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్లు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు లేదా కొన్ని రకాల రక్త క్యాన్సర్ల కారణంగానూ అభివృద్ధి చెందుతుంది. దీని ప్రధాన లక్షణాల్లో తగ్గని జ్వరం, తీవ్ర అలసట, కాలేయం లేదా ప్లీహం వాపు, చర్మంపై దద్దుర్లు, రక్తస్రావం, రక్తహీనత, కామెర్లు, తీవ్రమైన పరిస్థితుల్లో ఫిట్స్ లేదా మతిస్థిమితం కోల్పోవడం ఉన్నాయి.
రక్తపరీక్షలు, ఫెర్రిటిన్ స్థాయిలు, లివర్ ఫంక్షన్ పరీక్షలు, బోన్ మ్యారో పరీక్షల ద్వారా హెచ్ఎల్హెచ్ను నిర్ధారిస్తారు. చికిత్సలో కార్టికోస్టెరాయిడ్లు, ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ మందులు వాడతారు. తీవ్రమైన లేదా జన్యుపరమైన కేసుల్లో స్టెమ్ సెల్ (బోన్ మ్యారో) మార్పిడి కీలక చికిత్సగా వైద్యులు సూచిస్తారు.

