నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు
సుప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన, శక్తిపీఠ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నేటినుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు.. 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ వేడుకల కోసం ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శ్రీశైలం ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో పెయింటింగ్‌లతో సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల కొండలు దాటుకుని శ్రీశైలం తరలివస్తారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం అధికారులు విసృత ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, వసతి, వైద్యం, శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు.. మినరల్ వాటర్ ప్లాంట్లు, ప్రసాదం తదితర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేశారు.ఉత్సవాలలో రోజుకు కోటి 35 లక్షల లీటర్ల నీటిని భక్తులు కు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. టూరిస్ట్ బస్టాండు, శివదీక్ష శిబిరాలు, ఆలయ ముందు భాగంలో భక్తులు విశ్రాంతి కోసం భారీ షేడ్లు, షామియానలు ఏర్పాటు చేసారు.