సక్సెస్ స్కూల్‌పై చర్యలు కోరిన బీజేపీ
హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలోని సక్సెస్ స్కూల్‌లో ఓ హిందూ విద్యార్థికి కల్మా, సూరా అల్- ఫాతిహా హోంవర్క్‌గా ఇచ్చారనే ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ఖండించిన ఆయన, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక టీచర్‌పై చర్యలు తీసుకోవడం మాత్రమే సరిపోదని, పాఠశాల యాజమాన్యం బాధ్యతను కూడా నిర్ధారించాలని ఆయన అన్నారు. అవసరమైతే సంబంధిత పాఠశాల గుర్తింపును రద్దు చేసే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ఘటనపై స్పందించిన విద్యార్థి తల్లిని రాంచందర్ రావు అభినందించారు. విద్యా సంస్థలు విద్యను మాత్రమే బోధించాలని, ఏ మతానికి చెందిన ప్రార్థనలు లేదా ఆచారాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దకూడదని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి రాజ్యాంగబద్ధ హక్కులను గౌరవించడం విద్యాసంస్థల బాధ్యత అని గుర్తు చేశారు.
రాష్ట్రంలో కొన్ని విద్యాసంస్థల్లో హిందూ విద్యార్థుల మతాచారాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించిన ఆయన, ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని రాంచందర్ రావు కోరారు.

