HealthHome Page SliderInternationalLifestyle

‘హంటా’కు చికిత్స లేదు..నివారణే మార్గం

ప్రాణాంతక వైరస్ ‘హంటా’ ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇది కరోనా అంత వేగంగా వ్యాపించే రకం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ , ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎంవీ హోండియస్ క్రూయిజ్ షిప్‌లో ఈ వైరస్ కేసులు బయటపడటంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. ఈ వైరస్ బారిన పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో.. ఇది కరోనా తరహాలో మరో మహమ్మారిగా మారుతుందా? అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 వేల నుంచి లక్ష మంది వరకు ఈ వైరస్ బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి నిర్దిష్ట చికిత్స లేనందున నివారణే మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. మన పరిసరాల్లో ఎలుకలు లేకుండా చూసుకోవడం, గాలి వెలుతురు సరిగ్గా ఉండేలా జాగ్రత్త పడటం, పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హంటావైరస్ కరోనా అంత వేగంగా వ్యాపించకపోయినా, దాని ప్రాణాంతకతను బట్టి అప్రమత్తంగా ఉండటం అత్యవసరమని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. హంటావైరస్ ప్రధానంగా ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఎలుకల మూత్రం, లాలాజలం, విసర్జితాలు ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు, ఆ గాలిని పీల్చడం ద్వారా మనుషులు ఇన్ఫెక్షన్ బారిన పడతారు. ఇది రెండు రకాల తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతుంది. ఒకటి ఊపిరితిత్తులపై ప్రభావం చూపించే ‘హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్’, రెండోది కిడ్నీలను దెబ్బతీసే ‘హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్’. ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటి సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. నాలుగు రోజుల తర్వాత శ్వాస తీసుకోవడం కష్టమవ్వడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తుతాయి. ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు దాదాపు 40 శాతంగా ఉండటం ఆందోళనకరమైన విషయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి డాక్టర్ టెడ్రోస్ స్పందిస్తూ.. “ఇది కోవిడ్-19 వంటిది కాదు, ప్రస్తుతానికి దీనివల్ల ప్రజారోగ్యానికి వచ్చే ముప్పు చాలా తక్కువ” అని భరోసా ఇచ్చారు. సాధారణ సంభాషణలు లేదా దగ్గు ద్వారా ఇది అంత సులభంగా సోకదు.