మునుగోడులో టీడీపీ.. కాంగ్రెస్ వైపా? బీజేపీ పక్షమా?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో తెలంగాణాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక్కడ త్వరలో జరిగే ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ తమ అభ్యర్థుల వేటలో తలమునకలై ఉన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్మికను ఈ మూడు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ త్రిముఖ పోరులో ఒక్క శాతం ఓటుతోనే ఫలితం తారుమారయ్యే పరిస్థితి నెలకొనడంతో టీడీపీ, వామపక్షాలు, బీఎస్పీ తదితర చిన్న పార్టీల ఓట్లు ఎవరికి పడతాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ దశలో తెలంగాణాలోనూ నిర్ధిష్టమైన ఓటు బ్యాంకు కలిగిన తెలుగుదేశం పార్టీ అభిమానుల ఓటు ఎవరికి పడుతుందనే విషయం సస్ఫెన్స్‌గా నిలిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రాజగోపాల్‌కు పడ్డాయి. ఇప్పుడు ఆయన బీజేపీ తరఫున పోటీ చేయనుండటంతో టీడీపీ ఓట్లు మళ్లీ ఆయనకే పడతాయా? కాంగ్రెస్‌కు పడతాయా? అనేది వేయి డాలర్ల ప్రశ్నగా నిలిచింది.
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి గతంలో టీడీపీలో కీలక నేత. ఆయనకు ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో టీడీపీ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి పడతాయని కొందరు భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల కేంద్ర బీజేపీ నాయకులతో చంద్రబాబుకు దోస్తీ కుదిరిందని వార్తలొస్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకుంటే టీడీపీ అభిమానుల ఓట్లు మళ్లీ రాజగోపాల్‌రెడ్డికే పడే అవకాశాలున్నాయి. చంద్రబాబు ఏ వైఖరి తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.