Breaking Newscrimehome page sliderHome Page SliderTelanganaTrending Today

కీలక ఆధారాలతో వస్తా.. సిట్ కు బండి భగీరథ్ లేఖ


-బండి భగీరథ్ సిట్ విచారణకు గైర్హాజరు

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్, బుధవారం జరగాల్సిన సిట్ విచారణకు అనూహ్యంగా గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ, ఆయన రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, విచారణకు రాకపోవడంపై భగీరథ్ సిట్ అధికారులకు ఒక లేఖ రాశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈ రోజు విచారణకు రాలేకపోతున్నానని, శుక్రవారం కచ్చితంగా అధికారుల ముందుకు వస్తానని ఆ లేఖలో వివరించారు. తన వద్ద ఉన్న కీలక ఆధారాలతో విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆయన స్పష్టం చేయడం విశేషం. మరోవైపు, పోలీసులు ఈ కేసును అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. బాధితురాలి వాంగ్మూలాన్ని రెండోసారి నమోదు చేసిన అధికారులు, ప్రాథమిక ఆధారాల మేరకు ఈ కేసులో కఠినమైన పోక్సో సెక్షన్లను (సెక్షన్ 5(i) రెడ్ విత్ 6) అదనంగా చేర్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో అరెస్టు భయం వెంటాడుతుండటంతో, భగీరథ్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం (మే 14న) వెకేషన్ బెంచ్ విచారణ జరిపే అవకాశం ఉంది. కోర్టు ఇచ్చే తీర్పుపైనే భగీరథ్ తదుపరి అడుగులు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పోలీసులకు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరవుతానని భగీరథ్ ప్రకటించిన నేపథ్యంలో, ఆయన అధికారుల ముందు ఎలాంటి సాక్ష్యాధారాలు ప్రవేశపెడతారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవేళ కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరిస్తే, శుక్రవారమే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది.