ఏపీలో వైసీపీ పతనం ప్రారంభమైంది: బోండా ఉమ
ఏపీ రాజకీయాలు పవన్‌కళ్యాణ్ ,చంద్రబాబు భేటితో కొత్త మలుపు తిరిగాయి. అధికార పక్షంపై ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. ఈ మేరకు నిన్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అధికార,ప్రతిపక్షాల మధ్య అగ్గి రాజేసింది. కాగా అధికార,ప్రతిపక్ష పార్టీ నేతలు పోటాపోటిగా మీడియా సమావేశాలు నిర్వహించి తీవ్రస్థాయిలో ఒకరిపైఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బోండా ఉమ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పైసీపీ ప్రభుత్వం విలువలు లేని ప్రభుత్వమని తెలిపారు. ఏపీలో సీఎం జగన్ అరాచక పాలన చేస్తున్నారని ,రాజ్యాంగాలను,చట్టాలను నాశనం చేస్తున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అవినీతిని ప్రశ్నించినవారి ప్రాణాలు తీస్తున్నారన్నారు. రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలు,ఎంపీల అవినీతిని బయట పెట్టినందుకుగాను తప్పుడు కేసులు బనాయించి జైల్లో తోసేందుకు ఏమాత్రం వెనకాడని దుర్మార్గపు ప్రభుత్వమే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వమన్నారు.

సీఎం జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్న కాపు ఎమ్మెల్యేలు ,ఎంపీలు ఆయన పెంపుడు కుక్కల్లా తయారయ్యారన్నారు. ఏ మచ్చలేని నేతలను 18 నెలలు జైల్లో ఉండి,అనేక 420 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ విమర్శించడం శోచనీయమ్నారు. అంతేకాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు తమకు ఉన్న పరువు,ప్రతిష్టలను దిగజార్చుకొని మరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అసలు విశాఖలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను నిర్భందించాల్సిన అవసరం ఏంటని వైసీపీ ప్రభుత్వాన్ని బోండా ఉమ ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతతను హింసిస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాలలో ఏర్పడ్డ తాజా పరిణామాలు వైసీపీ పతనానికి సూచనలని బోండా ఉమా స్పష్టం చేశారు.

