NewsTelangana

బిడ్డ చంపుతావా.. చంపి బట్టకడతావా..

సీఎం కేసీఆర్‌కు ఈటల ఘాటు హెచ్చరిక

మునుగోడులో తన కాన్వాయ్‌పై దాడి పక్కా స్కెచ్‌ ప్రకారమే జరిగిందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ ఆరోపించారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని.. హుజూరాబాద్‌లో అవసరం లేని చాలా మందికి గన్‌ లైసెన్సులు ఇవ్వడమే దీనికి నిదర్శనమన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓటమితో తనపై సీఎం కేసీఆర్‌ పగపట్టారని.. ఆయన ప్రోత్సాహంతోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని.. ఒక్క రక్తపు బొట్టు కారినా కేసీఆరే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సీఎం ఆడిస్తే ఆడే తోలు బొమ్మలకు, చెంచాలకు బీజేపీ భయపడదన్నారు. ‘బిడ్డ చంపుతావా?.. చంపి బట్టకడతావా?.. నాపై ఈగ వాలితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’ అని కేసీఆర్‌ను ఈటల ఘాటుగా హెచ్చరించారు.

ఇప్పుడు బయటికెళ్తే.. ఇంటికి తిరిగొస్తామో.. లేదో..

మునుగోడులో కేసీఆర్ డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని ఈటల ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రికే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్క కారుతో అర్ధరాత్రి కూడా తిరిగే వాళ్ళమని.. నయీం ముఠా బెదిరించినా భయపడలేదని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్‌ హయాంలో బయటకు వెళ్తే ఇంటికి తిరిగొస్తామన్న నమ్మకం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య జమున తన సొంత ఊళ్లో ప్రచారానికి వెళ్లినా అడ్డుకునే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్ఎస్ దాడులను చూస్తూ ఊరుకునేది లేదని.. దేశాన్ని పాలిస్తున్న పార్టీలో తాను సభ్యుడినన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

గన్‌మెన్లు లేకపోతే నా తలకాయ ఉండకపోయేది..

తన కాన్వాయ్‌పై దాడికి చాలా సార్లు ప్రయత్నించారని.. పలివేల గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని సైతం అడ్డుకుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందని నిలదీశారు. పలివేల గ్రామంలో ఇంటింటికి తిరిగి తన సతీమణి ప్రచారం చేస్తుంటే అసభ్య పదజాలంతో దూషించారని.. మంత్రులు ప్రచారం చేస్తుంటే తాము అడ్డుకున్నామా? అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారని.. జెండా కర్రలతో కొట్టారని ఆవేదన చెందారు. తన గన్‌మెన్లు లేకపోతే తన తలకాయ ఉండకపోయేదని.. తన పీఆర్‌వో చైతన్య, గన్‌మన్‌ అంజయ్యలకు గాయాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి ఏకంగా డీఎస్పీనే కొట్టారని.. పోలీసుల విలువలు కాపాడటంలో డీజీపీ విఫలమయ్యారని విమర్శించారు.

రాష్ట్రం ఎటుపోతోంది..?

ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఓ రాష్ట్ర మంత్రి పట్టపగలు మద్యం తాగుతూ.. తాపించడం ఏమిటి..? రాష్ట్రం ఎటు పోతోందని ఈటల ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి, మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి ఏమైందని కేసీఆర్‌ను నిలదీశారు. 9 ఏళ్లలో ఏమీ చెయ్యలేని కేసీఆర్‌ మొన్న మునుగోడుకు వచ్చి 15 రోజుల్లో 100 పడకల ఆసుపత్రి కట్టిస్తా.. రోడ్లు వేయిస్తా.. అంటుంటే విడ్డూరంగా ఉందన్నారు. పిచ్చి వేషాలు, దౌర్జన్యాలు అపకపోతే ప్రజలే టీఆర్‌ఎస్‌ను బొంద పెడతారని దుయ్యబట్టారు. తమ మీటింగ్‌ వద్దకు టీఆర్‌ఎస్‌ నాయకులు రావడమేంటని.. తమపైనే దాడి చేసి.. తిరిగి వాళ్లపైనే దాడి చేసినట్లు ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ సమావేశం వద్దకు 100 మంది బీజేపీ కార్యకర్తలు వెళ్తే ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు.