Home Page SliderTelangana

హైదరాబాద్‌ను కాంక్రీట్ జంగిల్ చేస్తారా-ఈటల

హైదరాబాద్‌ను కాంక్రీట్ జంగిల్‌గా మార్చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. జీవో 111 రద్దును విరమించుకోవాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ మహా నగరాన్ని విధ్వంసం చేయవద్దంటూ ప్రభుత్వతీరును తప్పుపట్టారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 111ను రద్దు చేస్తున్నట్లు తెలంగాణా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఈటల. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేదలకు ఇళ్లు, స్థలాలు ఇస్తున్నారని, తెలంగాణాలో కేసీఆర్ ఒక గజం స్థలం కూడా పేదలకు ఇవ్వడం లేదని విమర్శించారు.

హైదరాబాదులోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ పరిధిలోని కొన్ని వందల ఎకరాల భూమిని ఈ జీవో క్రింద తీసుకొస్తూ, అక్కడ భవంతులు నిర్మాణం చేపట్టరాదన్నదే ఈ జీవో సారాంశం. అయితే ఇప్పుడు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ఈ జీవోను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ ప్రదేశంలో అపార్టమెంటులు, కంపెనీలు ఏర్పాటు ద్వారా జంటనగరాలకు తోడుగా మరో నగరం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనితో ఈ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇటీవల ఈ జీవో రద్దుపై అసమ్మతి తెలియజేశారు.