Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsNews AlertPoliticsTrending Todayviral

వారికి సినిమా చూపించడం ఖాయం: వైఎస్ జగన్

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ఆసక్తికర ప్రకటన చేశారు. త్వరలో పార్టీ తరఫున ఒక మొబైల్ యాప్‌ను తీసుకువస్తున్నామని, ప్రభుత్వ వేధింపులు లేదా అన్యాయాలకు గురైన వారు ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని ఆయన వెల్లడించారు. జగన్ మాట్లాడుతూ, “త్వరలోనే పార్టీ తరఫున యాప్ విడుదలచేస్తాం. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా వెంటనే ఆ యాప్‌లో వివరాలు నమోదు చేయవచ్చు. ఎవరి కారణంగా అయినా అన్యాయంగా ఇబ్బంది పడ్డా, వారిపై ఆ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చు… ఆధారాలు కూడా ఆ యాప్‌లో అందించవచ్చు… ఆ ఫిర్యాదు వెంటనే మన డిజిటల్ సర్వర్‌లోకి వచ్చేస్తుంది” అని తెలిపారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని ఆరోపిస్తున్న నేపథ్యంలో జగన్ ఈ డిజిటల్ ఉద్యమానికి తెర లేపడం గమనార్హం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేశ్ ‘రెడ్‌బుక్’ తీసుకొచ్చారని, తప్పుచేసినవారిని వదిలేది లేదని హెచ్చరించారని జగన్ గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన చేస్తామని జగన్ స్పష్టం చేశారు. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని, ఆధారాలుగా ఉన్న వీడియోలు, పత్రాలను అప్‌లోడ్ చేయవచ్చని సూచించారు. “ఈ ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం” అని జగన్ మరోసారి హెచ్చరించారు.