ఓట్ల చోరీపై ‘విస్పోటనం సృష్టిస్తా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలను త్వరలో వెలుగులోకి తెస్తామని రాయ్‌బరేలీలో ఆయన ప్రకటించారు. “ఓట్ల దొంగతనం వాస్తవం. మేం మీకు శక్తివంతమైన పేలుడు రీతిలో సాక్ష్యాలను ఇవ్వబోతున్నాం” అని స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సొంత లోక్‌సభ నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత కోటి కొత్త ఓటర్లు జాబితాలో చేరి, వారందరి ఓట్లు బీజేపీకే చేరాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి అవకతవకలు కర్ణాటక, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లోనూ జరిగాయని చెప్పారు. ఈసీ, బీజేపీ కుమ్మక్కై ప్రజల ఓటు హక్కును దోచుకుందని విమర్శించారు. బిహార్‌లో ఓటరు అధికార్ యాత్రలో 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఆరోపించారు.