‘జమ్మూ ప్రజలకెందుకీ శాపం’..మాజీ ముఖ్యమంత్రి కన్నీళ్లు
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఆమె జమ్మూ ప్రజలకెందుకీ శాపం అని కన్నీళ్లు పెట్టుకున్నారు. సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో చిన్నారులు, మహిళలు ఎదురుకాల్పులలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారని వారు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. ఎంతకాలం అక్కడి తల్లులకు కడుపుకోత అని కంటతడి పెట్టారు. బుధ, గురువారాలలో జరిగిన పాకిస్తాన్ కవ్వింపు చర్యలలో కుప్వారా, బారాముల్లా, ఉరీ, పూంచ్, మెంథార్, రాజౌరీ సెక్టార్లలో మోర్టార్లు, శతఘ్నులతో పాక్ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. వారిలో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.