NewsTelangana

కాళేశ్వరంపై అంత రహస్యమెందుకు?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నామని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పృహ తప్పి పడిపోయారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎంతగా ప్రతిఘటించినా కాళేశ్వరాన్ని సందర్శించే అవకాశాన్ని ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేశారు.

గతంలో ప్రత్యేక బస్సుల్లో సందర్శన
దేశానికే ప్రతిష్ఠాత్మకమైనదని టీఆర్‌ఎస్‌ సర్కారు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలకు చూపించేందుకు ఒకానొక దశలో టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందరినీ ప్రత్యేకంగా బస్సుల్లో తీసుకెళ్లి మరీ చూపించింది. మరి ఇప్పుడు అదే కేసీఆర్‌ సర్కారు కాళేశ్వరం వెళ్తానంటే ఎందుకు అడ్డుకుంటోంది? ఈ ప్రాజెక్టుపై ఇంత రహస్యమెందుకు?

నీట మునిగిన 29 బాహుబలి మోటార్లు
నిజానికి ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు గోదావరిలో వరద ముంచెత్తింది. ఈ వరద నీటిలో కాళేశ్వరంలోని అన్నారం, కన్నెపల్లి పంప్‌హౌజ్‌లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో 29 బాహుబలి మోటార్లు మూడు వారాలకు పైగా నీటిలో మునిగిపోయాయి. తర్వాత నీటిని తొలగించినప్పటికీ మోటార్లు, పంపులు, ఎలక్ట్రిక్‌ పరికరాలు చాలా కాలం పాటు బురదలోనే కూరుకుపోయాయి. ఇందులో ఎన్ని మోటార్లు దెబ్బ తిన్నాయో.. ఎన్ని పనికొస్తాయో చెప్పలేని స్థితిలో ఇంజనీర్లు ఉన్నారు. అన్నారం, కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. మీడియాతో పాటు విపక్షాలను దరిదాపుల్లోకి రానీయడం లేదు.

లక్ష కోట్లకు పైగా ఖర్చు
తన హయాంలోనే మెగా ప్రాజెక్టుగా, ప్రపంచంలోనే అద్భుత ఇంజనీరింగ్‌ నైపుణ్యంగా చెప్పుకున్న సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నా సీఎం కేసీఆర్‌కు మాత్రం చీమకుట్టినట్లు అయినా లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి నష్టంపై వాస్తవాలు వెల్లడిస్తే విమర్శలకు తావుండదని సూచిస్తున్నారు.

క్లౌడ్‌ బరస్ట్‌ అట..
కానీ.. కేసీఆర్‌ ఆ పని చేయకుండా గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్‌ బరస్ట్‌ జరిగిందనీ, దీంట్లో విదేశీ హస్తముందంటూ చేసిన విమర్శలతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కాళేశ్వరం మునిగిపోయిన ఘటనను తెరమరుగు చేసేందుకే కేసీఆర్‌ క్లౌడ్‌ బరస్ట్‌ అనే కొత్త నినాదాన్ని అందుకున్నారని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 3 మీటర్లు పెంచడం వల్లే గోదావరిలో వరద ముంచెత్తిందని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆరోపించడం మరో డ్రామాలా కనిపిస్తోందని ఆరోపిస్తున్నాయి.

తెల్ల ఏనుగు
కాళేశ్వరం ప్రాజెక్టుపై తొలి నుంచీ విమర్శలున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్న లక్ష కోట్ల రూపాయలు వృధా అని విపక్షాలు, ఇది తెల్ల ఏనుగులాంటిదని ఇంజనీరింగ్‌ నిపుణులు అంటున్నారు. మరోవైపు.. ఈ ప్రాజెక్టులో ఎత్తిపోతల కోసం వినియోగించిన మోటార్లకు కరెంటు బకాయిలే ఏకంగా రూ.3,600 కోట్లుగా తేలింది. గత మూడేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా 140 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. దీనికి రూ.3,600 కోట్ల బిల్లు వచ్చింది.

కరెంటు బిల్లు ఎకరానికి రూ.21,810
మొత్తం 82 మోటార్లకు ఏడాదికి 4,627 మెగావాట్ల విద్యుత్తు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. యూనిట్‌కు రూ.6.30 చొప్పున ఏడాదికి రూ.8,541 కోట్ల ఖర్చవుతుంది. ఈ లెక్కన కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎకరం సాగు కోసం కరెంటు బిల్లే రూ.21,810 అవుతుందని అధికారులు లెక్కకట్టారు. ఈ లెక్కన కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగు అన్న ఇంజనీర్ల అంచనా వాస్తవమేనని తెలుస్తోంది. ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రజలకు ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరదనే విమర్శలున్నాయి.