Home Page SliderTelangana

గజ్వేల్‌ విజేత ఎవరంటే!?

మెదక్ జిల్లాలో చారిత్రాత్మక నియోజకవర్గంగా గజ్వేల్ గుర్తింపు పొందింది. ఈ నియోజకవర్గం 2004కు ముందు రిజర్వ్ నియోజకవర్గంగా ఉండేది. గతంలో గీతారెడ్డి రెండుసార్లు విజయం సాధించారు. అయితే 2009 ఎన్నికల్లో ఇక్కడ్నుంచి నర్సారెడ్డి విజయం సాధించారు. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ ఇక్కడ్నుంచి పోటీ చేసి టీడీపీ నేత వంటేరు ప్రతాపరెడ్డిపై ఘన విజయం సాధించారు. 2014లో సాధించిన మెజార్టీకి సుమారుగా మూడు రెట్లు ఎక్కువగా 2018లో కేసీఆర్ సాధించడం విశేషం. అయితే ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపై మరోలా అన్నట్టుగా సీన్ మారుతోంది. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌ను ఓడిస్తానంటూ పంత పట్టారు బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్. హుజూరాబాద్ లో తనను దెబ్బతీయాలని చూసిన కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించి.. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి పతన శాసనం లిఖిస్తానంటున్నారు ఈటల. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తోండటంతో ముక్కోణపు పోటీ అనివార్యమయ్యేలా పరిస్థితుల కన్పిస్తున్నాయ్.

గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోలింగ్ బూత్‌లు 321 కాగా, పురుష ఓటర్లు 1,31,774 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,33,855 మంది కాగా ఏడుగురు ట్రాన్స్ జెండర్లు ఓటు నమోదు చేసుకున్నారు. ఇక మొత్తం ఓటర్లు 2,65,636 ఉన్నారు. గజ్వేల్ ఓటర్లలో ముదిరాజ్‌లు, బోయలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ముదిరాజ్‌లు మొత్తం ఓటర్లలో 20 శాతానికి చేరువగా ఉన్నారు. వారిలో తెనుగులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉండగా బోయలు 16 శాతానికి పైగా ఉన్నారు. మాదిగలు 13 శాతం, యాదవులు 13 శాతానికి చేరువలో ఉన్నారు. ముస్లింలు పదకుండున్నర శాతం, రెడ్డి సామాజికవర్గం 4 శాతం, మున్నూరు కాపు 4 శాతం, బ్రహ్మణులు, పద్మశాలీలు మూడేసి శాతం చొప్పున ఉన్నారు. ఇతర కులస్తులు సుమారుగా 12 శాతానికి పైగా ఉన్నారు.