ఆదిలాబాద్ గాలి ఎటువైపు!?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న జనరల్ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి. ఇక్కడ్నుంచి జోగు రామన్న నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి టీడీపీ నుంచి విజయం సాధించిన జోగు రామన్న తర్వాత మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. 2014లో జోగు రామన్నకు మంత్రి పదవి ఇవ్వడంతో నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అయితే 2018లో గెలిచిన తర్వాత మంత్రి పదవి దక్కకపోవడం, పార్టీలో అంతగా గుర్తింపు లేకపోవడంతో ఆయన పరిపతి తగ్గింది. నియోజకవర్గంలోనూ ఆయనకు అంత సానుకూలత లేదన్న భావన ఉంది. ముక్కోణపు పోటీ జరిగే కొద్ది నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి. ఇక్కడనుంచి కాంగ్రెస్ పార్టీ బలమైన ఎన్నారై అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డిని నిలబెట్టగా, బీజేపీ నుంచి పార్టీ ముఖ్యనేత పాయల్ శంకర్ మరోసారి బరిలో దిగారు. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ్నుంచి మార్పును కోరుకుంటున్న పరిస్థితుల్లో మొత్తం పరిస్థితులను కాంగ్రెస్, బీజేపీలో ఎవరు అనుకూలంగా మలచుకుంటారో చూడాల్సి ఉంది.

ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొత్తం 290 పోలింగ్ బూత్‌లు ఉండగా, పురుషులు 1,15,835, స్త్రీలు 1,19,908 ట్రాన్స్‌జెండర్లు 5 మంది ఓటు నమోదు చేసుకున్నారు. మొత్తం ఓటర్లు 2,35,748 ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మున్నూరుకాపు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం ఓటర్లలో వారి సంఖ్య 25 శాతం వరకు ఉంది. ఇక ముస్లింలు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఓటర్లలో వారి జనాభా 16 శాతంగా ఉంది. గోండ్లు ఐదున్నర శాతం, ఇతర ఓసీలు 5 శాతంగా ఉన్నారు. మాల, మాదిగలు జనాభా కొంచెం అటూ ఇటూగా సమానంగా ఉంది. రెండు వర్గాలు కలిపి 9 శాతం వరకు ఉన్నారు. ఆదిలాబాద్‌లో రెడ్డి ఓటర్లు నాలుగున్నర శాతం ఉన్నారు. ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీలు 10 శాతంగా ఉన్నారు. ఇక ఇతర వర్గాల ఓట్లు మొత్తం సుమారుగా 25 శాతంగా ఉన్నాయి.

