Andhra PradeshHome Page Slider

పరిపూర్ణానంద దారెటు? రెండు చోట్లా పోటీలో ఉంటారా?

Share with

స్వామి పరిపూర్ణానంద రాజకీయం ఏవిధంగా ముందుకు సాగుతుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు. ఓవైపు బీజేపీ పెద్దలను, మరోవైపు టీడీపీ నేతలపైనా పదునైన వ్యాఖ్యలతో ఆయన వార్తల్లో నిలిచారు. టీడీపీకి సానుకూలంగా ఉందని భావించే హిందూపురం నుంచి ఆయన ఎంపీ స్థానాన్ని ఆశించారు. అయితే ఆయనకు అటు బీజేపీ నుంచి గానీ, ఇటు టీడీపీ నుంచి గానీ పెద్దగా సానుకూలత లభించలేదు. దీంతో ముక్కుసూటితనానికి మారుపేరుగా నిలిచే స్వామి పరిపూర్ణానంద హిందూపురం ఎంపీగా, ఎమ్మెల్యేగాను బరిలో దిగారు. రెండు స్థానాల్లో నామినేషన్లు వేసిన ఆయన ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఆయన అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే హిందూపురం పరిసర ప్రాంతాల్లో స్వామి పరిపూర్ణానంద కోసం పనిచేస్తున్న శిష్యబృందం పోటీలో ఉండాల్సిందేనని చెబుతుంటే, బీజేపీ పెద్దలు ఎలా వ్యవహరిస్తారన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. పార్టీ తనకు బీజేపీ బీఫామ్ ఇస్తోందన్న విశ్వాసంతో పరిపూర్ణానంద ఉన్నారు. ఆధ్యాత్మిక రంగంలో విశేష కృషి కనబరిచిన స్వామి పరిపూర్ణానంద ఏపీ రాజకీయ ప్రవేశం, ఎలాంటి టర్న్ తీసుకుంటుందోనన్న అనుమానాలున్నాయి. ఆయనపై బీజేపీ సానుకూలత వ్యక్తం చేస్తుందా? లేదంటే ఆయన బీజేపీకి గుడ్ బై చెబుతారా? సొంత పార్టీ పెడతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఆర్ఎస్ఎస్ నుంచి సానుకూల మద్దతు ఉన్నప్పటికీ, బీజేపీ హైకమాండ్‌గానీ, స్థానిక బీజేపీ నేతలు గానీ, ఆయన పట్ల శ్రద్ధ చూపుతున్నట్టుగా లేదన్న వాదనను ఆయన వర్గీయులు చెబుతున్నారు. అందుకే టికెట్ కేటాయింపులో కుట్రలు చేశారని వారు ఆరోపిస్తున్నారు.

బీజేపీ టికెట్లు కేటాయించినవారిలో ఒక్క నర్సాపురం ఎంపీ స్థానానికి తప్పించి మిగతా వారందరూ కూడా ఇటీవల పార్టీలో చేరినవారేనని, మొదట్నుంచి పార్టీలో లేని వారేనన్న ప్రచారం దరిమిలా, తాను బీజేపీకి తెలంగాణ ఎన్నికల సమయంలో, ఎవరూ ముందుకు రాకున్నా, పార్టీకి జవసత్వాలు నింపితే, ఇప్పుడు పార్టీ ఇలా వ్యవహరించడమేంటన్న ఆవేదనలో స్వామీజి ఉన్నారని టాక్ విన్పిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలను, ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ముందుకు సాగే స్వామీజి ఈసారి ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా పోటీ చేయడం ద్వారా, ఏపీలో బీజేపీకి బలం వస్తుందని ఆశించారు. అయితే ఆయన ఆశలు అడియాశలే అయ్యాయి. హిందుస్థాన్‌కు మోడీజీ, హిందూపురానికి స్వామీజీ నినాదం అందుకున్నా ఆయనకు కలిసిరాలేదు. అటు ఎంపీ, ఎమ్మెల్యే రెండు చోట్లా పోటీ చేస్తానని ప్రకటించినా, అటు బీజేపీగానీ, ఇటు టీడీపీ పెద్దలు గానీ ఆయనను సంప్రదించలేదని, కనీసం విత్ డ్రా చేసుకోవాలని కూడా అడగలేదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఎలా ఉంటుందో తెలియాలంటే.. స్వామీజీ నోరు విప్పాల్సిందే.