టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు దారితీసిన నేపథ్యమిదే..!?
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో జరిగిన ₹ 371 కోట్ల కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, కుట్రదారుడు, లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఏపీ సీఐడీ పేర్కొంది. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రధాన నిందితుడిగా ఉన్నందున, దర్యాప్తు తీరును ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నందున అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ తెలిపారు.

‘పెరిగిన ప్రాజెక్ట్ వ్యయం’
2014లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సిమెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల క్లస్టర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసింది. సాంకేతిక భాగస్వాములైన సిమెన్స్, డిజైన్ టెక్ 90% గ్రాంట్-ఇన్-ఎయిడ్‌గా, ప్రభుత్వం 10% మాత్రమే ఇస్తుందన్నది ఉభయపక్షాల మధ్య అవగాహన. ఐతే ప్రాజెక్ట్ వ్యయాన్ని ₹ 3,300 కోట్లు పెంచి.. పది శాతం అమౌంట్ పై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించారని సీఐడీ చెబుతోంది. ఇద్దరి మధ్య ఎంవోయూ కుదుర్చుకున్నప్పటికీ… సిమెన్స్, డిజైన్ టెక్ అందించాల్సిన 90% సహకారం గురించి ప్రస్తావనే లేదు. ఈ ఎంవోయూను చంద్రబాబు నాయుడు, కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు ఇద్దరూ ఆమోదించారని పేర్కొంది. ఈ కుట్రలో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు హస్తం ఉందని సీఐడీ ఆరోపిస్తూ, మంత్రి మండలిని పక్కనబెట్టి… నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని ఆరోపించింది.

షెల్ కంపెనీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹ 371 కోట్లను విడుదల చేసిందని.. ఇందులో కొద్ది మొత్తాన్ని మాత్రమే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను స్థాపించడానికి ఉపయోగించారుని సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ చెప్పారు. డబ్బును షెల్ కంపెనీలు, నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా మళ్లించారని ఆరోపించారు. ఇన్‌వాయిస్‌లలో పేర్కొన్న అసలు డెలివరీ దర్యాప్తులో తేలలేదని చెప్పారు. దుర్వినియోగమైన నిధుల లబ్ధిదారులలో చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకులు ఉన్నారని సంజయ్ అన్నారు. “ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కంపెనీల అధిపతితో విచారణ ప్రారంభించినప్పటికీ, ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీల ద్వారా ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసిన కేసులో ప్రధాన సూత్రధారి, ప్రధాన కుట్రదారు చంద్రబాబు నాయుడు” అని అదనపు డీజీపీ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి, ఎప్పటికప్పుడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడానికి దారితీసే లావాదేవీల గురించి చంద్రబాబుకు ప్రత్యేక పరిజ్ఞానం ఉందని ఇదే దర్యాప్తులో కీలకమని సీఐడీ పేర్కొంది.

బ్యూరోక్రాట్లు అభ్యంతరాలు
అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీవీ రమేష్, స్పెషల్ సెక్రటరీ (ఆర్థిక శాఖ) కె.సునీత సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు కార్పొరేషన్‌కు సంబంధించిన ఫైళ్లలో నోట్స్ చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. డిజైన్ టెక్‌కు ముందస్తుగా నిధులు విడుదల చేయడాన్ని వారు ఆమెదించలేదు. పైగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇది జరుగుతున్నట్లు గుర్తించారు. అప్పటి డిజైన్ టెక్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ వినాయక్ ఖాన్విల్కర్ వంటి నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు నిల్వలతో సహా దుర్వినియోగమైన నిధుల తుది లబ్ధిదారులను కనుగొనడానికి CID దర్యాప్తు చేస్తోందని… కీలకమైన పత్రాలు కనిపించకుండా పోయాయని, కస్టడీలో ఉన్న ఆయనను, ఇతర ప్రాథమిక అనుమానితులతో విచారించేందుకు చంద్రబాబుని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని సీఐడీ తెలిపింది. “లోతుగా పాతుకుపోయిన, తీవ్రమైన ఆర్థిక నేరం కస్టడీలో విచారణ అవసరం. రాజకీయ పార్టీ అధినేతగా ముఖ్యమైన పదవిలో ఉండటం, ముఖ్యమంత్రిగానూ గతంలో పనిచేసి ఉన్నందున, చంద్రబాబు దర్యాప్తు తీరును ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నుండి ముందస్తుగా డబ్బు విడుదల చేయడంలో ప్రధాన నిర్ణయాధికారం ఆయనే’’ అని సంజయ్ అన్నారు.

సిమెన్స్ దూరం
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ వింగ్ కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు పంచుకున్న నోట్‌లో పేర్కొంది. సిమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక అంతర్గత విచారణను నిర్వహించిందని… అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ బోస్ అనుమతి లేకుండా ప్రవర్తించాడని పేర్కొంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా డిజైన్ టెక్‌కు చెల్లించిన ₹ 371 కోట్లలో సిమెన్స్ కేవలం ₹ 58.8 కోట్లు మాత్రమే పొందిందని సీఐడీ వర్గాలు తెలిపాయి. సౌమ్యాద్రి శేఖర్ బోస్, అప్పటి సిమెన్స్ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ ఖాన్విల్కర్ ₹ 241 కోట్లను స్వాహా చేశారని పేర్కొంది. హైదరాబాద్, పూణేలకు సొమ్మును పంపించేందుకు హవాలా చానెళ్లను ఉపయోగించుకున్నారని సీఐడీ తెలిపింది. స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బోస్, ఖాన్విల్కర్, స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మాజీ ఆర్థిక సలహాదారు, సంతకం చేసిన ముకుల్ చంద్ర అగర్వాల్, చార్టర్డ్ అకౌంటెంట్ సురేష్ గోయల్‌లను ఈ ఏడాది ప్రారంభంలో ED అరెస్టు చేసింది. డిజైన్ టెక్‌కు చెందిన ₹ 31.2 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఏజెన్సీ తాత్కాలికంగా అటాచ్ చేసింది.

