సీవోపీడీ అంటే ఏమిటి?
దీర్ఘకాలిక చికిత్స అవసరమయ్యే సీవోపీడీ(క్రానిక్ అబ్స్రక్టివ్ పల్మనరీ డిసీజ్) వ్యాధి కేవలం ఊపిరితిత్తులకు సంబంధించినది మాత్రమే కాదు. బాధితులలో వివిధ అవయవాలకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా ఉంటాయి. ఆస్టియోపొరోసిస్, హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, కార్పెల్ పల్మనాలె వంటి సమస్యలు కూడా దీనిలో కలిసి ఉంటాయి. అందువల్ల ఈ లక్షణాలను గుర్తిస్తూ దీనికి చికిత్స అందించవలసి ఉంటుంది. దీనినే సిండమిక్ అప్రోచ్ అంటారు. ఈ వ్యాధిని స్పైరోమీటర్ అనే పరికరం సహాయంతో తెలుసుకుంటారు. శ్వాస పరీక్షల ద్వారా సమస్య తీవ్రత ఎంతో తెలుసుకుంటారు. వారు ఉండే స్థలంలో, పనిచేసే ప్రదేశాలలో కాలుష్యం, పొగతాగడం వంటి అలవాట్లు వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడతాయి. వీరికి చికిత్స ఎంత త్వరగా జరిగితే ఫలితాలు అంత బాగుంటాయి. ఇన్‌హేలర్స్ ద్వారా శ్వాసను సాఫీగా జరిగేలా చేస్తారు. వీరికి ఊపిరితిత్తులలో కఫం పెరగకుండా చూసుకోవాలి. తీవ్రతను బట్టి హోమ్ ఆక్సిజన్ థెరఫీ ఇవ్వవలసి ఉంటుంది. చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు కూడా చేయవలసి ఉంటుంది. పొగతాగే అలవాట్లను పూర్తిగా మానేయాలి.