వక్ఫ్ బిల్లుపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
పార్లమెంట్‌లో ఎట్టకేలకు వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది. ఉభయ సభలలోనూ అధికార, విపక్షాల మధ్య వాగ్వాదాల నడుమ ఈ బిల్లును ఆమోదించారు. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశంలో ఒక చరిత్రాత్మక మలుపు అని వ్యాఖ్యానించారు. కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యవస్థలో జవాబుదారీతనం లేదని, పారదర్శకత లోపించిందని పేర్కొన్నారు. ఇప్పుడు దీని కారణంగా అట్టడుగు వర్గాలకు, మహిళలకు మేలు జరుగుతుందని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇలాంటి చట్టాలను అమలులోకి తేవడానికి సహకరించిన కమిటీ సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లుతో సామాజిక న్యాయం జరుగుతుందని, బలమైన భారత్‌ను కలిసి నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఇక లాంఛనంగా రాష్ట్రపతి సంతకంతో వక్ఫ్ సవరణ బిల్లు అమలులోకి రానుంది. ఇకపై దీనిని ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ బిల్లుగా( ఉమీద్-యుఎంఈఈడీ)గా పేర్కొంటారు. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్ బిల్లుగా కూడా దీనికి ఆమోదం లభించింది.