రైతులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు..
తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులతో సీఎం నేరుగా మాట్లాడారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రామాపురం చేరుకున్నారు. దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించి బాధిత రైతులతో సీఎం మాట్లాడారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలవుతున్నాయని కేసీఆర్ తెలిపారు. ఈ పథకాలతో రైతులు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారన్నారు. అప్పుల ఊబిలో నుంచి బయటపడుతున్నారని సీఎం పేర్కొన్నారు. తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ మన దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులు అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని కేసీఆర్ భరోసానిచ్చారు. వెంటనే ఈ సాయాన్ని రైతులకు అందజేస్తామని స్పష్టం చేశారు. వాస్తవానికి రైతులకు ఇచ్చే దాన్ని నష్టపరిహారం అనరని.. సహాయ పునరావాస చర్యలు అంటారన్నారు.

అకాల వర్షాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 2 లక్షల 22 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న 1,29, 446, వరి 72, 709, మామిడి 8,865, ఇతర పంటలు అన్ని కలిసి 17, 238 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని సీఎం వివరించారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్ప రైతులకు లాభం చేసే బీమాలు, కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవన్నారు. పాత ప్రభుత్వాలు అంతే.. ఇప్పుడు కూడా అంతే.. చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా ఉందని మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశానికే కొత్త అగ్రికల్చర్ పాలసీ ఖావాలి. ఇప్పుడు ఒక డ్రామా నడుస్తోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.