మీడియా ఎదుట అగ్రనేతల వార్
అధికారిక సమావేశంలో మీడియా ముందే వాగ్వాదానికి దిగారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. దీంతో వైట్‌హౌస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.. డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ ఇరువురు నేతలు కూడా తగ్గేదే లేదంటూ.. మీడియా ఎదుటే ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకున్నారు. శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. ‘జెలెన్‌స్కీ.. ఒప్పందం కుదుర్చుకో.. లేదంటే మేం బయటకు వెళ్లిపోతాం’’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందన్న ట్రంప్.. దాన్ని నుంచి గట్టెక్కడం అసాధ్యమని హెచ్చరించారు. దానికి జెలెస్కీ కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు. దీంతో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం మొదలయింది.ఉక్రెయిన్ వెంటనే శాంతి ఒప్పందానికి ఒప్పుకోవాలి.. అప్పుడే ఆ దేశంపై బుల్లెట్ల వర్షం ఆగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. గత అధ్యక్షుడు బైడన్ తన అంత స్మార్ట్ కాదని.. తమ సాయానికి కృతజ్ఞులుగా ఉండాలి తప్ప.. ఇలా ప్రవర్తించడం సరికాదంటూ ట్రంప్.. జెలెన్ స్కీ కి సూచించారు.అమెరికా ఈ విధంగా మాట్లాడటం సరికాదని.. యుద్ధ సమయంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయని జెలెన్స్కీ అన్నారు.. ఇప్పుడు దానిని అనుభవించడం లేదు, అయితే భవిష్యత్తులో మీరు దానిని అనుభవిస్తారంటూ జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనలపై మీ నిర్ణయం ఏంటని ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రశ్నించారు.