1500 మంది పోలీసు బందోబస్తుతో ప్రారంభమైన విజయ హనుమాన్ శోభాయాత్ర
హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాదులో వేలమంది భక్తులతో శోభాయమానంగా హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమయ్యింది. 1500 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. ఓ పక్క రంజాన్ మాసం జరుగుతుండడంతో ఎలాంటి అవాంఛనీయసంఘటనలు జరగకుండా పోలీసులు భారీ సంఖ్యలో బారులు తీరారు. కోఠి నుండి, గౌలిగూడా నుండి విజయయాత్రలు ప్రారంభమయ్యాయి. చిన్న చిన్న ర్యాలీలు కూడా ఈ ర్యాలీలో కలుస్తాయి. ఈ యాత్రలో కర్మన్ ఘాట్ నుండి వచ్చే ఊరేగింపులు కూడా కలుస్తాయని, మొత్తంగా రాత్రి 8 గంటల సమయానికి తాడ్‌బన్ ఆంజనేయస్వామిని చేరతాయని నిర్వాహకులు చెప్తున్నారు. దీనిలో విశ్వహిందూ పరిషత్ కూడా పాల్గొంది. ఈ యాత్రలో ప్రత్యేకంగా హనుమాన్ వెండి విగ్రహం కూడా తయరు చేయించడం విశేషం. ఈ సారి యాత్రలో మహిళా భక్త బృందాలు కూడా పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా ఈ రోజున హై అలెర్ట్ కొనసాగుతోంది. బెంగాల్, బీహార్,జార్ఖండ్, ఢిల్లీలలో శ్రీ రామ నవమి రోజు హింసాత్మక ఘటనలు జరిగిన కారణంగా ఈ హనుమాన్ జయంతికి కూడా జరగవచ్చనే హెచ్చరికలు వచ్చాయి. దీనితో ప్రభుత్వాలు అప్రమత్తమై భారీ బందోబస్తులను ఏర్పాటు చేశారు.


 
							 
							