మైసూరులో విషాదం..
కర్ణాటకలోని మైసూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఈ ఘటన నగరంలో సంచలనం కలిగించింది. మైసూరులోని విశ్వేశ్వరయ్య నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నట్లు సమాచారం. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి చేతన్(45), అతని భార్య రూపాలి(43), కుమారుడు కుశాల్(15), తల్లి ప్రియంవద(65) మృతి చెందారు. ఆత్మహత్యకు ముందు చేతన్ అమెరికాలోని సోదరుడికి ఫోన్ చేసి, కుటుంబంతో సహా ప్రాణాలు తీసుకుంటున్నట్లు తెలిపాడని, దీనితో కంగారు పడిన అతని సోదరుడు స్థానికంగా ఉన్న బంధువులకు ఫోన్ చేయగా, వారు వచ్చే సరికే చేతన్ ఉరి వేసుకున్నారని, అతని భార్య, కుమారుడు విగత జీవులుగా పడి ఉన్నారని పోలీసులు తెలిపారు. దగ్గరే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌లో అతని తల్లి మృతదేహం కూడా లభ్యమయ్యింది. దీనితో కుటుంబసభ్యులకు విషం ఇచ్చి, చేతన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.