దేశానికి సంపూర్ణ అక్షరాస్యత ఎప్పుడో ( నేడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం)
“శ్రద్ధయా స్పర్థయా వర్థతే విద్య” అన్నారు పెద్దలు. శ్రద్ధగా, పోటీ పడి చదివితే విద్య బాగా వస్తుందని దాని అర్ధం. భారతదేశంలో పూర్వకాలం నుండి విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. గురుకులాలు ఏర్పాటు చేసి, ఆసక్తి గల విద్యార్థులకు చదువు నేర్పించేవారు. విద్య అంటే కేవలం పుస్తకాలు బట్టీ పట్టడం కాదు. సమాజంలో బతికేందుకు అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం కూడా అక్షరాస్యత కిందే వస్తుంది. ప్రతివ్యక్తి జీవితానికి విద్య ఎంతో విలువ ఇస్తుంది. మహిళలు చదువుకుంటే ఆ కుటుంబానికే ఎంతో మేలు జరుగుతుంది.

“ విద్య లేని వాడు వింత పశువు” అనే నానుడి కూడా ఉంది. చదువు ఒకరి నుండి మోసపోకుండా ఉండేలా, ఆలోచనా విధానం విసృతంగా పెరిగేలా చేస్తుంది. నిరక్షరాస్యులు చదువు రాక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా వ్యవసాయదారులు చదువులేకపోతే భూస్వాముల చేతుల్లో చాలా మోసపోతూ ఉంటారు. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విపరీతంగా పెరుగుతున్న దేశ జనాభా, అరకొర సౌకర్యాలు దీనికి అడుగడుగునా అడ్డు పడుతున్నాయి. మన దేశంలో అక్షరాస్యతా శాతాన్ని చూసుకుంటే ప్రస్తుతం 74.04 గా ఉంది. వీరిలో పురుషులు 82.14 శాతం అయితే, మహిళలు 65.46 శాతంగా ఉన్నారు. దేశంలో కేరళ 93.91 శాతం అక్షరాస్యతతో మొదటి స్థానంలో ఉండగా, 92.28 శాతంతో లక్షద్వీప్ తర్వాతి స్థానంలో ఉంది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో 91.58 శాతం అక్షరాస్యత ఉంది. చివరిస్థానంలో బీహార్ 63.82 శాతంతో ఉంది.

2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే విద్యారంగంలో నెలకొన్న సవాళ్లతో ఈ లక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. దేశానిక స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో 18.3 శాతంగా ఉన్న అక్షరాస్యత రేటు 2022 నాటికి 77.7 శాతం పెరిగింది. దీన్ని బట్టి అక్షరాస్యత పెంచడంలో ప్రభుత్వాలు కొంతమేరకు విజయం సాధించాయనే చెప్పవచ్చు.
ఏడేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వస్తే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. ప్రజల్లో విద్యపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి ప్రతీ ఏడాది సెప్టెంబరు 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది transforming literacy learning spaces ఇతివృత్తంతో ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు మరిన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది. అక్కడ సరైన స్కూళ్లు లేక ఎక్కువమంది విద్యకు దూరంగా ఉంటున్నారు. 2030 లోపు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే ప్రభుత్వాలు సమష్టిగా మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

