Andhra PradeshNews

బ్రహ్మాండనాయకుని.. బ్రహ్మోత్సవాలు

కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమలకు బ్రహ్మోత్సవ శోభ వచ్చేసింది. బ్రహ్మోత్సవ అద్భుత ఘట్టానికి ఇప్పటికే తిరుమల కొండలు ముస్తాబయ్యాయి. తిరుమల మొత్తం దగదగా మెరిసే విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. సాక్షాత్తు బ్రహ్మ సారధ్యంలో జరిగే ఈ ఉత్సవం అత్యంత వైభవంగా ఆడంబరంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇంతటి ఘనమైన ఉత్సవం దేశంలో మరెక్కడా జరగదు. అందుకే బ్రహ్మోత్సవం జరిగే తొమ్మిది రోజులు భక్తులు శ్రీవారిని కనులారా చూసేందుకు తరలివస్తారు. ఆ దేవదేవుడి వైభవాన్ని వైభోగాన్ని వాహన సేవలను చూసేందుకు ప్రపంచంలోనే లక్షలాది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి చూసి తరిస్తారు. ఈ నెల 26న అంకురార్పణలతో ఆరంభమై అక్టోబర్ 5 న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు తిరుమలలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని చూడటానికి అల వైకుంఠం నుంచి ముక్కోటి దేవతలు విచ్చేసి ఆశీర్వదిస్తారని ప్రతీతి. బ్రహ్మోత్సవాల కాలంలో తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణం వన్నెలీనుతుంది. వాహన సేవలు భక్తుల కోలాహంతో ఏడుకొండలు గోవింద నామాలతో మారుమోగుతుంటాయి. మూడేళ్లకు ఒకసారి అధికమాసం సందర్భంగా బ్రహ్మోత్సవాలకు తోడు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ. ఇప్పుడు జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా ఏకాంతంగా భక్తులు లేకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు కరోనా తగ్గు ముఖం పట్టిన కారణంగా ఈ బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి లక్షల్లో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఎవరికి ఎలాంటి చిన్న కష్టం కూడా కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి స్పెషల్ దర్శనాలు, 300 రూపాయల టికెట్లు, సిఫార్సు లేఖలు అన్ని రద్దు చేశారు. సామాన్య భక్తులందరికీ సులభంగా దర్శనం అయ్యేలా అన్ని రకాల చర్యలను టీటీడీ తీసుకుంది. ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ బ్రహ్మోత్సవాల మొదటి రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.