రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు జోన్ లు
తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దేందుకు సమగ్ర రోడ్ మ్యాప్ ఈ డాక్యుమెంట్‌లో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రైజింగ్–2047 పాలసీ డాక్యుమెంట్‌పై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష గురువారం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి దిశను స్పష్టంగా ప్రతిబింబించేలా పాలసీ డాక్యుమెంట్ రూపుదిద్దుకోవాలని సీఎం సూచించారు.రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ , పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ , రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ . ఈ రీజియన్ల వారీగా ఏ రంగం ఎక్కడ అభివృద్ధి చెందాలో స్పష్టతగా నమోదు చేయాలని తెలిపారు.
హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, జీసీసీలు, ఫార్మా, అగ్రికల్చర్‌తో పాటు ఇతర రంగాల్లో అవసరమైన అభివృద్ధి దిశపై ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. రోడ్లు, పోర్టులు, కనెక్టివిటీ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకమని గుర్తుచేశారు. సంక్షేమం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, ఎనర్జీ వంటి ప్రతి విభాగానికీ పాలసీ డాక్యుమెంట్‌లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని చెప్పారు.
తెలంగాణలో పాలసీ పెరాలసిస్‌కు చోటులేదన్న సందేశం ఈ డాక్యుమెంట్ ద్వారా వెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసే ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకులతో పాటు కార్గో సర్వీసులను కూడా అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వాస్తవిక దృక్పథం ప్రతిఫలించేలా డిజైన్లు, ప్రణాళికల రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

