Home Page SliderNational

బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పనకు ముచ్చటగా మూడు పథకాలు

కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉపాధి కల్పన, ఉద్యోగాలపై ముచ్చటగా మూడు కొత్త పథకాలను ప్రకటించారు. ప్రధానమంత్రి ప్యాకేజి కింద మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టారు.

ఉద్యోగంలో మొదటిసారి చేరేవారికి ఒక నెల వేతనం అందిస్తామని ఆర్థికమంత్రి తెలిపారు. సంఘటిత రంగంలోని అన్ని సెక్టార్లకూ ఈ పథకం వర్తిస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద మూడు వాయిదాలలో చెల్లిస్తారు. గరిష్టంగా రూ.15 వేల వరకూ పొందవచ్చు. దాదాపు 210 లక్షల మందికి దీని ద్వారా ప్రయోజనం లభిస్తుంది.

తయారీ రంగంలో అదనపు ఉపాధి అవకాశాల కోసం యాజమాన్యాలకు కూడా ప్రోత్సాహకాలు కల్పించారు. ఉద్యోగుల భవిష్యనిధి కంట్రిబ్యూషన్ ద్వారా దీనిని అందజేస్తారు. దీనిద్వారా 30 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. గరిష్టంగా లక్ష రూపాయల వేతనం ఉన్నవారికి దీన్ని వర్తింపజేస్తారు. అదనపు ఉద్యోగాలు కల్పించిన యాజమాన్యాలకు రెండేళ్లపాటు మూడు వేల రూపాయలు ఈపీఎఫ్‌ఓ కంట్రిబ్యూషన్‌ను రీఎంబర్స్ చేస్తామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 50 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక హాస్టళ్లు, శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరిశ్రమలలో మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ప్రధానమంత్రి ప్యాకేజి కింద ఐదేళ్ల వ్యవధిలో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణనిస్తామన్నారు.

ప్రభుత్వ పథకాలు, విధానాల ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందని యువత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలను ప్రకటించింది. దేశీయ విద్యా సంస్థలలో ఉన్నత విద్యకోసం తీసుకునే రూ.10 లక్షల వరకూ రుణాలకు ఆర్థిక సాయం అందజేస్తుంది. ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణ మొత్తంపై 3 శాతం వడ్డీ రాయితీ ఇచ్చే ఈ-వోచర్లు అందజేస్తామని ప్రకటించింది.