బాలికలకు బాసట ఈ పోలీస్ సిస్టర్
తమిళనాడులోని వేలూరు జిల్లా కలెక్టర్ సుబ్బులక్ష్మి బాలికల భద్రత కోసం సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. పాఠశాల, కళాశాలల విద్యార్థినులపై లైంగిక వేధింపులు, బలాత్కారాలు, ఇతర మానసిక, శారీరక సమస్యల పరిష్కారం కోసం పోలీస్ అక్క (పోలీస్ సిస్టర్) పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం కింద వేలూరులోని 308 పాఠశాలలు, 123 కళాశాలలో పోలీసులను నియమించారు. వారి వద్ద విద్యార్థినులు లైంగిక వేధింపులు, ఇతర సమస్యలను ధైర్యంగా చెప్పుకోవచ్చు. అలాగే మత్తు పదార్థాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు కూడా కళాశాలలు, పాఠశాలలో అడ్డుకట్ట వేసినట్లవుతుంది. దీనిపై అవగాహన పెంచడానికి ఉదయం పూట ప్రార్థనా సమావేశంలో మహిళా పోలీసులచే మాట్లాడించడానికి కూడా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. దీని ద్వారా ఆడపిల్లలకు అందుబాటులో రక్షణ ఉంటుందని వివరించారు. ఈ విధానం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇలాంటి పద్దతి దేశవ్యాప్తంగా అమలు చేస్తే, ప్రాధమిక స్థాయిలోనే నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు.