Home Page SliderInternational

జంక్ ఫుడ్ ప్రియులకు స్వర్గం ఈ ‘హార్ట్ ఎటాక్’ రెస్టారెంట్

పిజ్జాలూ, బర్గర్లూ బాగా లాగిస్తారా.? జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టమా? ఐతే మీకు ఈ రెస్టారెంట్ బాగా సూటవుతుంది. ఆరోగ్యాభిలాషులే కాదు జంక్ ఫుడ్ ప్రియులు కూడా చాలామందే ఉంటారు. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా, జంక్ ఫుడ్‌ను మానుకోలేరు. అలాంటివాళ్ల కోసం ఏర్పాటు చేసిందే అమెరికాలోని ఈ హార్ట్ ఎటాక్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్‌లో అందరూ ఎగబడి తినేది హ్యామ్ బర్గర్. దీనితో  పదివేల క్యాలరీల శక్తి లభిస్తుందట. ఇదే కాదు ఇక్కడ లభించే ఆహారం ప్రతీదీ ఒక మనిషి తీసుకోవాల్సిన రోజువారీ క్యాలరీల కంటే చాలా అధికంగా ఉంటుందట.

అంతేకాదు, ఇక్కడ వెయిటర్లు కూడా డాక్టర్లు, నర్సుల వేషాలలో తిరుగుతూ ఉంటారు. కస్టమర్లకు పేషెంట్ వేసుకునే గౌను లాంటిది ఇస్తారట. మనం ఇచ్చే ఆర్డర్‌ను ప్రిస్క్రిప్షన్ అంటారట. దీనిని జాన్ బాసో అనే వ్యక్తి 2005లో మొదలుపెట్టారట. ఇది వెరైటీగా ఉండడంతో చాలా పేరు సంపాదించి, లాభాలార్జిస్తోంది. పెట్టిన ఫుడ్ పూర్తిగా తినకపోతే సరదాగా బెల్టుతో కొడతారట. అంతేకాదు, 150 కిలోల కంటే బరువు ఉండేవారికి ఎంత తింటే అంత ఫుడ్ ఫ్రీ అనే స్కీమ్‌ను కూడా పెట్టారు. వినడానికి సరదాగా ఉన్నా ఈ రెస్టారెంట్‌పై విమర్శలు కూడా అలాగే ఉన్నాయి. కస్టమర్ల ఆరోగ్యాన్ని పాడు చేస్తోందని ఈ రెస్టారెంట్ తరచుగా వార్తల్లో ఉంటుంది. ఈ విపరీతమైన క్యాలరీలు గల ఆహారం తిని, చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. అయినా ఇక్కడికి వచ్చేవారి సంఖ్య తగ్గడం లేదు.