దేశరక్షణలో కీలకం ఈ హజారికా సేతు
కేంద్ర ప్రభుత్వం దేశరక్షణ వ్యవస్థ బలోపేతానికి మరో ముందడుగు వేసింది. సరిహద్దు రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఒక వంతెన నిర్మించింది. మనదేశంలోనే అతి పొడవైన వంతెనగా అస్సాంలోని భూపేన్ హజారికా సేతును నిర్మించింది. ఈ వంతెన అస్సాం- అరుణాచల ప్రదేశ్‌లను అనుసంధానిస్తూ 9.15 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశరక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. 60 టన్నుల బరువు ఉండే భారీ యుద్ధ ట్యాంకులను సైతం తట్టుకునేలా పటిష్టంగా ఈ వంతెనను తీర్చిదిద్దారు. అరుణాచల ప్రదేశ్ తమదేనంటూ చైనా పదేపదే కవ్వింపుచర్యలకు పాల్పడుతోంది. భారత సైన్యంలోని అర్జున్, టీ-72 వంటి యుద్ధ ట్యాంకులను ఈ వంతెన ద్వారా సరిహద్దుకు సులువుగా తరలించవచ్చు.

పూర్తిగా స్తంభాలపై నిర్మించిన భాపేన్ హజారికా సేతు అస్సాంలోని ఉత్తరప్రాంతాన్ని, అరుణాచల ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాన్ని కలుపుతూ బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్‌పై నిర్మించడంతో దీనిని ధౌలా సాదియా వంతెనగా కూడా పిలుస్తారు. టిబెట్‌లో పుట్టి, అరుణాచల్‌లో అడుగుపెట్టే లోహిత్ నది అస్సాంలోని బ్రహ్మపుత్రలో కలుస్తోంది. ఈ వంతెన పర్యాటకులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని బౌద్ధారామాలను, ప్రకృతి అందాలను వీక్షించాలనుకునే పర్యాటకులు కూడా ఈ వంతెన మీదుగా వెళ్లవచ్చు.
ఈ భూపేన్ సేతును హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించింది. 2011 నవంబరులో నిర్మాణం పూర్తిచేసి, 2017లో పూర్తి చేసింది. దాదాపు 1000 కోట్ల రూపాయలు వెచ్చించారు. అస్సాంకి చెందిన కవి, రచయిత, సంగీతదర్శకుడు ,నేపథ్యగాయకుడు,నటుడు, నిర్మాత అయిన బహుముఖప్రజ్ఞాశాలి భారతరత్న భూపేన్ హజారికా పేరును ఈ వంతెనకు పెట్టారు.