‘ఈ కేసు మాకొద్దు బాబోయ్’..తప్పుకున్న ముగ్గురు న్యాయమూర్తులు
ఒకే కేసు విచారణ కోసం మాకొద్దంటే..మాకొద్దంటూ ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు తప్పుకోవడం తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే తొలిసారిగా జరిగింది. సాధారణంగా గతంలో హాజరైన కేసు విచారణ నుండి గానీ, వ్యక్తిగత కారణాల వల్ల కానీ ఇలాంటి కేసు మాకొద్దంటూ ఒక న్యాయమూర్తి తప్పుకోవడం సహజమే. కానీ ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు గాలి జనార్థన రెడ్డి దాఖలు చేసిన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు నుండి తప్పుకున్నారు. ఈ కేసులో గాలి జనార్థన రెడ్డితో పాటు మరో ఆరుగురిని దోషులుగా తేల్చి, సీబీఐ కోర్టు వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ శిక్షను రద్దు చేసి, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దోషులు హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై మొదట జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు విచారణ చేపట్టి, సీబీఐ వివరణ లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. దీనితో అది వాయిదా పడింది. మరో ఐదు పిటిషన్‌లు జస్టిస్ కె. శరత్ బెంచ్ ముందుకు విచారణకు రాగా, తాను ఈ కేసు విచారించలేనని, మరో న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. ఇవి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీ నారాయణ బెంచ్ ముందుకు రాగా తాను కూడా విచారించలేనని తప్పుకున్నారు. చివరికి జస్టిస్ నగేశ్ భీమపాక వద్దకు ఫైళ్లు రాగా, ఇది ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు అని తాను కూడా తప్పుకునంటున్నానని పేర్కొన్నారు. చివరకు మరో వారం రోజుల పాటు వేచి ఉంటే కేసు విచారణకు వచ్చే అవకాశముంది.