నాకు మంత్రి పదవి రాకుండా వాళ్లే అడ్డుకున్నారు
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి . ఇదివరకు అధికార పక్ష నేతలకు ,ప్రతిపక్ష నేతలకు మధ్య మాటల యుద్ధాలు జరిగేవి కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది , అన్ని పార్టీల్లోనూ అంతర్గత విభేదాలు కనిపిస్తున్నాయి . పదవి రాలేదని కొందరు , పార్టీ మారాలనే ఆలోచనలో కొందరు, పార్టీ లో ఉండటం ఇష్టం లేక సొంత పార్టీ నాయకులనే తిడుతూ రోజు వార్తల్లో ఉంటున్నారు .ఇది అన్ని పార్టీల్లో పెద్ద సమస్యగా మారింది . అసంతృప్త నేతలను ఎలా బుజ్జగించాలో తెలియక పార్టీల పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ కి పెద్ద సమస్యగా మారింది . ఆయన నేరుగా సీఎం పైననే విమర్శలు చేస్తూ పార్టీ డామేజీ చేసేలా వ్యవహరిస్తున్నారు .దీనిపై పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఆయనపై సీరియస్ అయ్యింది .ఇదిలా ఉండగా మంత్రి పదవి హామీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు . రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చిన మాట నిజమేనని ఆదివారం ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. భట్టి చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా మరో సంచలన ట్వీట్ వేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు, అడ్డుకుంటూ, అవమానిస్తున్నారని , నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు ప్రజలకు తాము ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశించారు.