Home Page SliderNews AlertTelangana

ప్రశ్నించే వారిని తెలంగాణ సర్కార్‌ వేధిస్తోంది..

Share with

చంచల్‌గూడ జైలులో ఉన్న సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయనేత తీన్మార్‌ మల్లన్నను హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ములాఖత్‌ అయ్యారు. తీన్మార్‌ మల్లన్నను కలిసి దాడి జరిగిన రోజు అసలేం జరిగిందని ఈటల అడిగి తెలుసుకున్నారు. మీకు, మీ కుటుంబానికి తమ మద్దతు ఎప్పడూ ఉంటుందని ఆయనకు ధైర్యం చెప్పారు. అనంతరం బోడుప్పల్‌లోని తీన్మార్‌ మల్లన్న ఇంటికి వెళ్లి మల్లన్న కుటుంబాన్ని పరామర్శించిన ఈటల.. తీన్మార్‌ మల్లన్న భార్యకు, తల్లికి ధైర్యం చెప్పారు. ప్రజల కోసం పోరాడే జర్నలిస్టులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పి మల్లన్న కుటుంబంలో మనోస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. మల్లన్న పైన అనేక సంవత్సరాలుగా పగబట్టారు.  ఆఫీసుల మీద దాడి చేయడం, కంప్యూటర్లను, ఇతర సామాగ్రిని విధ్వంసం చేయడం.. అందులో పని చేస్తున్న జర్నలిస్టుల పైన, స్టాఫ్ పైన దౌర్జన్యం చేయడం.. ఇంటి ఓనర్ ను ఖాళీ చేయించాలని బెదిరించడం చేస్తున్నారు.  ఇవి చాలవు అన్నట్లుగా గతంలోనే అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు. కేసులకు బెదిరింపులకు భయపడని మల్లన్న తన వృత్తిని కొనసాగిస్తున్న క్రమంలో మళ్లీ ప్రైవేటు గుండాల చేత ప్రైవేట్ మనుషుల చేత దాడి చేయించే ప్రయత్నం చేశారు. దాడి చేసిన వారి మీద కేసులు పెట్టాలి కానీ మళ్లీ మల్లన్న మీదనే హత్యాయత్నం కేసు పెట్టడం అనేది పూర్తి అప్రజాస్వామీకం.

 కావాలని కేసులు పెట్టి జైల్లో పెట్టాలని రోజువారీగా ప్రచారం చేసే వార్తలను అడ్డుకోవాలి.. ప్రేక్షకులకు దూరం చేసే ప్రక్రియలో భాగంగానే జైల్లో పెట్టారు.  ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి అప్రజాస్వామిక పద్ధతులు మంచివి కావు. మీకు ఒక న్యాయం మందికో న్యాయం ఉండే ఆస్కారం లేదు. ప్రజాస్వామ్యాన్ని చెరబడితే, అకారణంగా దాడి చేస్తే.. అధికారం ఉందని బెదిరిస్తే అదే బాధ అనుభవించే రోజు మీకు కూడా వస్తుంది. తప్పించుకోలేరు. పోలీసులు కూడా ప్రగతి భవన్ నుంచి స్కెచ్ రాగానే అమలు చేసే పద్ధతి మంచిది కాదు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండవు. కేసీఆర్ ప్రభుత్వం 2023 వరకే ఉంటుంది. చెప్పగానే కొట్టడం, కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదు. ఈ రోజు మల్లన్న  కుటుంబాన్ని పరామర్శించాము. ధైర్యంగా ఉండాలని చెప్పాము. ఎక్కువకాలం నిర్బంధాలతో, కేసులతో, జైలుతో కొనసాగించలేరు. తెలంగాణ సమాజం వీటిని ఓర్చుకోదు. సందర్భం వచ్చినప్పుడు బరిగేసి కోట్లాడి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు.