కరీంనగర్ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది
కరీంనగర్ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది .. మానేరుపై గన్నేరువరంలో హై లెవల్ బ్రిడ్జి సహా పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్ అభివృద్ధి కోసం రూ.868 కోట్ల సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో భాగంగా రూ.150 కోట్లు కేటాయించగా, అందులో గన్నేరువరం హై లెవల్ బ్రిడ్జి కోసం రూ.77 కోట్లు, అర్నకొండ-మల్యాల డబుల్ రోడ్డు కోసం రూ.50 కోట్లు, వేములవాడ-సిరికొండ రోడ్డు కోసం రూ.23 కోట్లు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని బండి సంజయ్ ఎక్స్‌లో వెల్లడించారు. గన్నేరువరం హై లెవల్ బ్రిడ్జి 15 ఏళ్ల ప్రజల పోరాటం ఫలితమని, అర్నకొండ-మల్యాల డబుల్ రోడ్డు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, వేములవాడ-సిరికొండ రోడ్డు 20 ఏళ్లుగా ఉన్న డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు. “ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం, నితిన్ గడ్కరీ సహకారంతో కరీంనగర్ ప్రజల కలలు నిజమవుతున్నాయి. నేను ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నాను” అని బండి సంజయ్ తెలిపారు.

