చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టు బెయిల్..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అక్రమ మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో 226 రోజుల పాటు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. చెవిరెడ్డితో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు గా ఉన్న రాజ్ కసిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మాత్రం హైకోర్టు కొట్టివేసింది.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ తన అభియోగాల్లో పేర్కొంది. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి నుంచి భారీగా నగదు అందుకున్న చెవిరెడ్డి, ఆ సొమ్మును గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థుల కోసం ఉపయోగించారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ క్రమంలోనే గత ఏడాది జూన్ 17న బెంగళూరు విమానాశ్రయంలో ఆయనను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చెవిరెడ్డిని ఏ-38గా, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని ఏ-39గా చేర్చారు.
బెయిల్ మంజూరు చేసే క్రమంలో హైకోర్టు నిందితులకు కొన్ని షరతులు విధించింది, అందులో భాగంగా వారి పాస్‌పోర్టులను తక్షణమే కోర్టుకు అప్పగించాలని ఆదేశించింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చెవిరెడ్డికి బెయిల్ రావడంతో వైసీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇదే కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ, ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ప్రస్తుతం ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మనీలాండరింగ్ కోణంలో విచారణను వేగవంతం చేసింది.

