Andhra PradeshHome Page Sliderhome page slider

ఉగాది నుంచే ‘గ్రీన్ కవర్’ యాక్షన్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర భూభాగంలో 50 శాతం పచ్చదనాన్ని నింపే ‘గ్రీన్ కవర్ ప్రాజెక్టు’లో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం కావాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వెలగపూడి సచివాలయంలో అటవీ శాఖ , వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఉగాది నుంచే ‘గ్రీన్ కవర్ యాక్షన్ ప్లాన్’ అమలు కావాలని, ఆలోపు అన్ని శాఖలు పూర్తిస్థాయి ప్రణాళికలతో సిద్ధం కావాలని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ ఉండాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం మొత్తం 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 2030 నాటికి 37 శాతం పచ్చదనం సాధించాలని, ప్రస్తుతం ఉన్న 30 శాతం గ్రీనరీకి తోడుగా వచ్చే నాలుగేళ్లలో మరో 7 శాతం పెంచేలా 9 లక్షల హెక్టార్లలో చెట్లను నాటాలని అధికారులకు నిర్దేశించారు.
ఈ బృహత్తర యజ్ఞంలో వివిధ శాఖలకు పవన్ కల్యాణ్ ప్రత్యేక బాధ్యతలను కేటాయించారు. మొత్తం లక్ష్యంలో ఉద్యానవన శాఖ 12 శాతం మొక్కలు నాటే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలపై దృష్టి పెట్టాలని, తీర ప్రాంతాల్లో పెనుగాలులు మరియు ఉప్పు నీటిని తట్టుకునే మొక్కలను పెంచాలని ఆదేశించారు. ముఖ్యంగా ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రాజెక్టులో భాగంగా మన నేలలకు అలవాటైన స్వజాతి వృక్షాలనే నాటాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధుల కేటాయింపు ,పర్యవేక్షణపై అధికారులతో కూలంకషంగా చర్చించిన ఉపముఖ్యమంత్రి, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా భవిష్యత్ తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ప్రతి అధికారి దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని పని చేయాలని కోరారు. ఉగాది నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యాచరణ ద్వారా రాష్ట్రంలో గణనీయమైన పర్యావరణ మార్పులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.