ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు రచ్చరచ్చ
ఏపీ అసెంబ్లీష శాసనమండలి సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకురావడంతో సభలో గలాట అయ్యింది. స్పీకర్ టేబుల్‌పై టీడీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చించి విసిరేశారు. తొలి రోజు 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, శ్రీధర్ రెడ్డిలను సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు.

సభను అగౌరవపరిచారన్న కారణంతో వారిపే వేటు వేశారు. ఇవాళ సభలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తొడగొట్టి మీసం మెలేశారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ మండిపడ్డారు. సభ స్థానాన్ని అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ ఇకపై ఇలాంటి చర్యలు చేయొద్దని హెచ్చరించారు. మొదటితప్పుగా భావించి, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవన్నారు.

ఇక అంతకు ముందు.. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. బీఏసీ ప్రకారం.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27 వరకు కొనసాగుతాయని, శని, ఆదివారాలు అసెంబ్లీ సమావేశాలకు సెలవులుగా ప్రకటించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి రేపు శాసనసభలో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి టీడీపీ హాజరుకాలేదు.

