Andhra PradeshHome Page Slider

పోల’వరం’ తొలిదశకు నిధులు మంజూరు చేసిన కేంద్రం

Share with

సీఎం జగన్ శ్రమ, కృషి ఫలిం­చింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడు­దలపై కేంద్రంను ఒప్పించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం తొలిదశకు కేంద్రం రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిల్లుల చెల్లింపులో విభాగాల వారీగా పెట్టిన పరిమితులను తొలగించడానికి కూడా కేంద్రం అంగీకరించింది. అలాగే, ప్రాజెక్టుకు 2013–14 ధరలతో కాకుండా తాజా ధరల ఆధారంగా నిధులు చెల్లించేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్‌ ఎల్‌కే త్రివేది సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా­రామన్‌ ఆమోదించినట్టు లేఖలో స్పష్టీకరించారు.

2013–14 ధరల ప్రకా­రం పోలవరానికి నిధులిచ్చేందుకు గతంలో కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన నేపథ్యంలో ఈ నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపాలని కోరింది. కేంద్ర మంత్రి మండలి ఆమోదం తీసుకుని నిధులు విడుదల చేస్తామని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే అనేక సార్లు జగన్ పోలవరం ప్రాజెక్టుకు నిధుల కోసం ఢిల్లీ వెళ్లారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేసి తొలిదశలో ముందస్తుగా ఫలాలను రైతులకు అందించేందుకు వీలుగా రూ.10,000 కోట్లను అడ్‌హాక్‌గా (ముందస్తుగా) ఇవ్వాలని ప్రధాని మోదీని గత ఏడాది జనవరి 3న ఢిల్లీలో సీఎం జగన్‌ ప్రతిపాదించారు. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లేనని కానీ, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లని, ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి సాధ్యపడదని ప్రధాని మోదీకి సీఎం వివరించారు.