తెనాలిలో అన్నక్యాంటిన్ వద్ద ఉద్రిక్తత
“అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదన్నట్లయ్యింది” గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేతల వ్యవహారం. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్‌ను జరగనివ్వకుండా అడ్డు పడుతున్నారు. తెనాలిలో మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గతనెల 12 న అన్న క్యాంటిన్‌ను ఏర్పాటుచేశారు తెలుగుదేశం నేతలు. ఈ క్యాంటిన్ తొలగించాలంటూ రెండురోజుల క్రితం నోటీసులు జారీ చేసారు అధికారులు. క్యాంటిన్ నిర్వహణ వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయంటూ ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నిర్ణయం సరికాదంటూ టిడిపి వారు ఆందోళనకు దిగారు.

ఈరోజు ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మొహరించారు. క్యాంటిన్‌కు ఆహారం తెచ్చే వాహనాన్ని దారిమధ్యలోనే ఆపేశారు. కూర పాత్రలను తీసుకెళ్లిపోయారు. దీంతో పోలీసులకు, టిడిపి శ్రేణులకు మధ్య వాగ్వివాదం జరిగింది. కూరలు లేకుండానే ఆహార పంపిణీ మొదలు పెట్టారు. ఈ గొడవ ముదిరి అక్కడ మార్కెట్ సెంటర్లో కర్ఫూ వాతావరణం నెలకొంది. షాపులను కూడా బలవంతంగా మూయించేశారు. మార్కెట్ మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు.

