Andhra PradeshNews

ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం: రాహుల్ గాంధీ

Share with

◆ అధికారంలోకి వస్తే ఏకైక రాజధానిగా అమరావతిని చేస్తాం
◆ భారత్ జోడో యాత్రలో అమరావతి రైతుల తో రాహుల్ గాంధీ
◆ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర
◆ పాదయాత్రకు భారీగా తరలివచ్చిన జనం

కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చేరుకుంది. ఆలూరు నియోజకవర్గం హల్వాహరి బస్టాండ్ వద్ద ఉదయం ఏడు గంటలకు పాదయాత్ర ప్రారంభం అయింది. భారీ జన సందోహం మధ్య డప్పుల చప్పులతో యాత్ర కొనసాగింది. ప్రజలు అడుగడుగునా రాహుల్ గాంధీ పాదయాత్రకు స్వాగతం పలికారు. యాత్రలో రాహుల్ గాంధీని కలిసేందుకు పోటీపడ్డారు. యాత్రలో ఆసాంతం భారత్ జోడో నినాదాలు మార్మోగాయి. ఏపీకి చెందిన కాంగ్రెస్ ప్రధాన నేతలతో పాటు యువ నేతలు జతవటంతో భారీ జన సందోహం రాహుల్ గాంధీ వెంట నడిచింది.

పాదయాత్ర విరామ సమయంలో అమరావతి రైతులు రాహుల్ గాంధీని కలిశారు. వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతులకు తీరని అన్యాయం చేసేలా వ్యవహరిస్తుందని రైతులు రాహుల్ దృష్టికి తీసుకురాగా స్పందించిన రాహుల్ గాంధీ తమ పార్టీ నుంచి రైతులకు అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారం లోకి వస్తే ఏకైక రాజధానిగా అమరావతిని చేస్తామని అమరావతి రైతులకు ఆయన హామీ ఇచ్చారు. బిజెపి ప్రభుత్వంతో దేశానికి ఇప్పటిదాకా ఒరిగిందేమీ లేదని విభజన హామీలను బిజెపి ప్రభుత్వం తుంగలో తొక్కిందని నిరుపేదలకు నిత్యవసర ధరలను అమాంతం పెంచి సామాన్య జీవితానికి గుదిబండగా మారిందని రాహుల్ అన్నారు. రాబోయే కాలంలో దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే మొట్టమొదటిగా విభజన హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ పై తొలిసంతకం పెడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం హాల్వాహరి బస్టాండ్ వద్ద ప్రారంభమైన పాదయాత్ర చాగి గ్రామం వద్ద ముగిసింది.

బుధవారం చాగి నుండి పాదయాత్ర ప్రారంభమై ఆదోని ఆర్ట్స్ కళాశాల వరకు కొనసాగనున్నదని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో 2024లో తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. భారత్ జోడోయాత్ర విరామ శిబిరంలో నిర్వహించిన పాత్రికేయులు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 41 రోజులు భారత్ జోడో యాత్ర సాగిందని ఏపీలో నాలుగు రోజులు యాత్ర కొనసాగిన తర్వాత తిరిగి కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని ఆ తర్వాత తెలంగాణలో కొనసాగుతుందని తెలిపారు. విభజన అనంతరం ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఆదోనిలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతారని, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగుతున్న ఈ యాత్ర అన్ని వర్గాలకు చేరువతుందని అన్నారు.