సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ జాగృతి మద్దతు
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ జాగృతి మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పష్టంచేశారు.
కవిత మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ పెద్దల చర్యలే నిదర్శనమని విమర్శించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో బిల్లులు పాస్ చేయడం మినహా ఆ రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగపరంగా, రాజకీయపరంగా ఉన్న ఏ అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని, అంతేకాకుండా ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం కూడా ప్రయత్నం చేయలేదని కవిత ఎద్దేవా చేశారు. గవర్నర్‌ను కలసి ఆర్డినెన్స్ జారీ చేయమని కోరలేదని, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లులను కోల్డ్ స్టోరేజిలో పెట్టినా న్యాయపోరాటం చేయలేదని ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.
“బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే, బీసీలు ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు” అని కవిత హెచ్చరించారు.