కాలేజీకి రాని అధ్యాపకులు.. నిలిచిన డిగ్రీ పరీక్ష
మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఓ కాలేజీలో డిగ్రీ పరీక్ష నిలిచిపోయింది. తమకు జీతాలు ఇవ్వడం లేదనే కారణంతో అధ్యాపకులు కాలేజీకి రాలేదు. దీంతో గురువారం ఉదయం జరగాల్సిన డిగ్రీ పరీక్ష ఆగిపోయింది. తూప్రాన్‌లోని నలంద డిగ్రీ కళాశాలలో గత కొన్ని రోజులుగా పరీక్షలు జరుగుతున్నాయి. అయితే.. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సింది.. 10.30 గంటలు అవుతున్నా కాలేజీ తాళాలు తెరచుకోలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలకు యాజమాన్యం సెంటర్ తాళాలు తీయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి నిరసన తెలిపారు. తహసిల్దార్ విజయలక్ష్మి, ఓయూ స్క్వాడ్ బృందం ఘటనాస్థలికి చేరుకొని యాజమాన్యంతో చర్చిస్తున్నారు. ఐదు నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించని యాజమాన్యంపై ఫిర్యాదు నమోదైంది. అనంతరం అధికారులు చొరవ తీసుకుని విద్యార్థులు పరీక్ష రాసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు.

