తమిళనాడు మంత్రి 41.9 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ
గత రెండురోజులుగా తమిళనాడు విద్యాశాఖమంత్రి పొన్ముడి, అతని కుమారుని ఇంటిలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు 41.9 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేశారు. సోమ, మంగళ వారాలలో ఆయనను, ఆయన కుమారుడు గౌతమ శిఖామణిని చెన్నైలోని ఈడీ కార్యాలయంలో విచారించారు. సీజ్ చేసిన ఆస్తులకు సరైన ఆధారాలు లేవని ఈడీ అధికారులు తెలియజేశారు. పొన్ముడి నివాసంలో 81.7 లక్షల రూపాయలతో పాటు 13 లక్షల రూపాయల విలువ గల బ్రిటిష్ పౌండ్లు కూడా ఉన్నాయన్నారు. వీరిది అక్రమ సంపాదనగా భావిస్తున్నామని పేర్కొన్నారు. వీటితో రకరకాల ఆస్తుల కొనుగోలు, పెట్టుబడులు చేశారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. వీరికి సంబంధించిన పలు కంపెనీలు కూడా ఇలా అక్రమ సంపాదనతో పెట్టినట్టే భావిస్తున్నారు. అయితే ఈ సోదాలపై డీఎంకే నేత, ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా తమ పార్టీని ఎదిరించలేక, దర్యాప్తు సంస్థలను ఇలా దుర్వినియోగం చేస్తోందని, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈడీ దాడులకు తమ పార్టీ భయపడేది లేదన్నారు.


 
							 
							