ఠాగూర్ మూవీ హాస్పటల్ సీన్.. మాదాపూర్ లో రిపీట్
కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులు ..వైద్యం కోసం వచ్చే వారిని ఎలా నిలువుదోపిడీ చేస్తారో చాలా తెలుగు సినిమాల్లో అనేక సందర్భాల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు.సేమ్ టు సేమ్ అలాంటి సీన్ హైద్రాబాద్ లోని మాదాపూర్‌లో బుధవారం రిపీట్ అయ్యింది. జూనియర్ డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యానికి గురైన నాగప్రియ అనే యువతిని కుటుంబ సభ్యులు మాదాపూర్‌లోని మెడికోవర్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స నిమిత్తం రూ.3లక్షలకు పైగా డబ్బు చెల్లించారు.అయినా ఫలితం లేకుండా పోయింది. మరో రూ.లక్ష చెల్లించాలంటూ వైద్యులు చెప్పారు.తీరా డబ్బు చెల్లించిన గంటకే నాగప్రియ మృతి చెందిందని చెప్పారు.దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు,బంధువులు ఆందోళనకు దిగారు. డబ్బు చెల్లించాకే మృతి వార్తను చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు తమకింకా రూ.4లక్షలు చెల్లిస్తేనే డెడ్ బాడీని అప్పగిస్తామంటూ ఆసుపత్రి వైద్యులు దౌర్జన్యం చేస్తున్నారని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.

