Home Page SliderNational

మహారాష్ట్ర సీఎం షిండే భవితవ్యంపై కాసేపట్లో సుప్రీం కోర్టు తీర్పు

గత ఏడాది జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసినందుకు షిండేతో పాటు మరో 15 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలా వద్దా అని సుప్రీం కోర్టు మరికాసేపట్లో నిర్ణయించనుంది. షిండే, ప్రతిపక్ష బిజెపి మద్దతుతో, శివసేనను విభజించి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొందరు ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించిన తరువాత, థాక్రే అత్యున్నత న్యాయస్థానాన్ని అశ్రయించారు. ఒకవేళ షిండే అనర్హుడైతే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం రద్దవుతుంది. ఎవరివైపు ఎమ్మెల్యేలు ఎక్కువున్నారన్నదాని ఆధారంగా సమీకరణాలు ఆధారపడి ఉన్నాయి. ఇందుకు సంబంధించి 8 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం వెలువడనుంది.

కోర్టులో ఉద్ధవ్ థాక్రే బృందం తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదించగా, ఏక్నాథ్ షిండే శిబిరం తరఫున హరీష్ సాల్వే, నీరజ్ కౌల్, మహేశ్ జెఠ్మలానీలు వాదించారు. తీర్పుకు ఒక రోజు ముందు, మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే 288 మంది సభ్యుల అసెంబ్లీలో అధికార శివసేన-బీజేపీ కూటమికి 184 ప్లస్ సీట్లు ఉన్నాయని, అవసరమైతే తమ మెజారిటీని నిరూపించుకోవచ్చని పేర్కొన్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటం. చట్టం మన వెంటే ఉందన్నారు. ఈ కేసులో విచారణలు మార్చిలో ముగియకముందే, అసెంబ్లీలో ఓటింగ్‌ను ఎదుర్కొనే బదులు థాక్రే, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ఎలా పునరుద్ధరించవచ్చో వివరించాలని సింఘ్వీని కోర్టు కోరింది. ఫిబ్రవరిలో గొడవపై తీర్పునిస్తూ, ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును షిండేకి కేటాయించింది. థాక్రే వర్గానికి శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే అనే పేరు, మండుతున్న టార్చ్ చిహ్నంగా ఇచ్చింది.