బెంగాల్లో టీచర్ల నియామకాల స్కామ్‌పై సుప్రీం కీలక తీర్పు..
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అక్కడ 2016లో చేపట్టిన 25 వేలకు పైగా ఉపాధ్యాయుల నియామకాలు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. ఈ నియామకాలు రద్దు చేస్తూ గతంలో బెంగాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అప్పటి నియామక ప్రక్రియలో చాలా ఆర్థఇక అవకతవకలు జరిగాయని, ఈ ప్రక్రియలో ఉద్యోగం సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఫిబ్రవరి 10న తీర్పును రిజర్వులో పెట్టింది. తాజాగా తీర్పు ఇస్తూ ఈ నియామక ప్రక్రియ కళంకమైనదని అభివర్ణించింది. అయితే టీచర్లకు కాస్త ఊరట కలిగించే విషయం ఏమిటంటే తాము అందుకున్న జీతాలు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అయితే దివ్యాంగ కోటాలో ఉద్యోగం సాధించిన వారు కొనసాగే అవకాశం కల్పించింది. రాబోయే మూడు నెలల్లో కొత్త టీచర్ల నియామకాలు పూర్తి చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కుంభకోణం కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

