అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలంటూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేవేసింది. ఈ కేసుపై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్ కే. పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఏపీ, తెలంగాణ లను మినహాయించి కొత్తగా రూపొందించిన జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గం మాత్రమే పునర్విభజన చేయడం అసమంజసమైని పేర్కొన్న పిటీషనర్ల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆర్టికల్ 170(3) ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై పరిమితులు ఉండే అవకాశముందని పేర్కొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఇచ్చిన ప్రతిపాదనలో మార్పులు చేయడం కేంద్రం నిబంధనల ప్రకారమేనని వివరించింది. జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ రాజ్యాంగ పరిధిలోనే జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో జరిగిన పునర్విభజనను తెలుగు రాష్ట్రాలతో పోల్చడం తగదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీ, తెలంగాణలను పునర్విభజన నోటిఫికేషన్ నుండి మినహాయించడంలో కేంద్రానికి ప్రత్యేక ఉద్దేశ్యం లేదని, ఇందులో రాజ్యాంగ విరుద్ధత లేదని సుప్రీంకోర్టు తేల్చింది. ఈ తీర్పుతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఆశపై నీళ్లు చల్లినట్లైంది.