ఏపీ ఓటర్ల మద్దతు బీఆర్ఎస్‌కా, కాంగ్రెస్ కా?
తెలంగాణలో ఆంధ్ర నేపథ్యమున్న ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఆంధ్రా తెలంగాణ నేపథ్యమున్న ఓటర్లు భారీగా ఉన్నారు. వారందరూ కూడా ఆయా పరిస్థితులను బట్టి ఆయా పార్టీలకు ఓటేస్తూ వచ్చారు. టీడీపీకే ఎప్పుడూ వేద్దామని ఆ పార్టీ నుంచి ఉన్నవారే గెలవాలని అనుకోలేదు. అందుకే ఎన్టీఆర్ టీడీపీ పెట్టినా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆయా ఎన్నికల్లో ఆయా అవసరాలను బట్టి సందర్భాలను బట్టి వారు ఓటేశారు కానీ మా వాడు.. మా కులపోడని ఓటేయలేదు. కులం పిచ్చ కొందరికి మాత్రమే ఉంటుందని అనాదిగా రుజవయ్యింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత సీన్ మొత్తం చేంజ్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తోంది. రాష్ట్రం విడిపోయినప్పటికీ మనుషులు మాత్రం విడిపోలేదని, పాలు-నీళ్లలా రెండు ప్రాంతాల సామాన్య ప్రజలు కలిసి జీవిస్తున్నారని ఘనత వహించిన గులాబీ నేతలు అవసరాలను బట్టి, సందర్భాన్ని బట్టి చెబుతూ వచ్చారు. అది నిజం కూడా. తెలంగాణలో ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ ఉన్నారు. మరికొందరు బీజేపీకి సైతం జై కొడుతున్నారు.

