సన్‌సిటీ కారు ప్రమాదంలో విస్తుపోయే విషయాలు
సన్‌సిటీలో అత్యంత వేగంగా కారు నడిపి మార్నింగ్ వాక్ చేస్తున్నఇద్దరు తల్లీకూతుర్ల మరణానికి కారణమైన డ్రైవర్ అతని ప్రెండ్స్ గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రైవర్ బద్రుద్దీన్ వెంట గణేష్, మహ్మద్ ఇబ్రహీం, ఫైజన్ అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన బద్రుద్దీన్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. వీరు యాక్సిడెంట్ జరిగిన వెంటనే మరో ఫ్రెండ్‌కు కాల్ చేసి కారు తెప్పించుకుని నేరుగా మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌కు పారిపోయారు. రెండు ప్రాణాలు పోయాయనే బాధ కూడా లేకుండా పార్టీకి కూడా ఏర్పాట్లు చేసుకున్న ఈ గ్యాంగ్‌ను చూసి అక్కడికెళ్లిన పోలీసులు కంగుతిన్నారు. కేవలం మేజర్ అయ్యాననే ఆనందంతో రాత్రంతా పార్టీ చేసుకున్నాడట బద్రుద్దీన్. అంతేకాకా ఉదయం కూడా పార్టీ కోసం ఫ్రెండ్స్‌తో కలిసి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కి మితిమీరిన వేగంతో వెళ్తూ అదుపు తప్పి వాకింగ్ చేస్తున్న వారిమీదుగా దూసుకుపోయాడు. ఈ ఘటనలో మృతి చెందిన ఇద్దరితో పాటు మరో మహిళ, మరో వ్యక్తి కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. నగర వాసులకు భద్రత లేదని, లైసెన్స్ కూడా లేకుండా ఇలా డ్రైవింగ్ చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఈ రోడ్ రాక్షసులను కఠినంగా శిక్షించవలసిందేనంటూ హైదరాబాద్ వాసులు ట్వీట్లు చేస్తున్నారు.
